Monday, December 19, 2016

రూ.5వేలు కంటే ఎక్కువ డిపాజిట్ చేయొద్దు

రూ.5వేలు కంటే ఎక్కువ డిపాజిట్ చేయొద్దు


పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత బ్యాంకు అకౌంట్ల‌టో న‌గ‌దు డిపాజిట్స్‌పై ప‌రిమితులు విధిస్తూ కొత్త రూల్స్ ప్ర‌వేశ‌పెట్టింది రిజ‌ర్వ్ బ్యాంక్‌. ఇక‌పై రద్దు అయిన నోట్ల‌తో ఒక్క ఖాతాలో ఒక్క‌సారి మాత్ర‌మే రూ.5వేలు డిపాజిట్ చేయొచ్చ‌ని పేర్కొంది. ఆ పై చేసిన ఖాతాల‌పై నిఘా ఉంటుంద‌ని.. ఖాతాదారుడు వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంద‌ని RBI  స్ప‌ష్టం చేసింది. డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు ఈ నిబంధ‌న అమ‌లు చేయాల్సిందిగా అన్ని బ్యాంకుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. రూ.5వేల కంటే త‌క్కువ మొత్తాన్ని ఎన్నిసార్లైనా డిపాజిట్ చేసుకోవ‌చ్చ‌ని చెప్పిన RBI.. డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్స్‌కు ప‌రిమితులు లేవ‌ని వివ‌రించింది. ఇత‌రుల అకౌంట్స్‌లో పెద్ద‌మొత్తంలో న‌గ‌దు డిపాజిట్ చేసి న‌ల్ల‌కుబేరులు వాటిని పొందుతున్న నేప‌థ్యంలో కేంద్రం ఈ కొత్త నిబంధ‌న‌ను తీసుకొచ్చింది.

8 మంది యాంకర్లను తొలగించిన టీవీ చానల్.. కారణం అదే

8 మంది యాంకర్లను తొలగించిన టీవీ చానల్.. కారణం అదే



టీవీలో కనిపించాలంటే అందంగా, నాజూగ్గా ఉండాలని తెలిసిందే. అయితే లావుగా అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈజిప్టు ప్రభుత్వ చానల్ 8 మంది మహిళా ఉద్యోగులను తొలగించింది. నెలరోజుల్లో సన్నబడి నాజూగ్గా తయారైతేనే ఉద్యోగం ఉంటుందని తేల్చి చెప్పింది. విషయం తెలిసిన మహిళా సంఘాలు ఈజిప్షియన్ రేడియో అండ్ టెలివిజన్ యూనియన్ (ఈఆర్టీయూ) తీరుపై భగ్గుమంటున్నాయి. మరోవైపు సస్పెన్షన్‌కు గురైన యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా తాను లావుగా ఉన్నానో లేదో అనే విషయాన్ని ప్రజలను అడిగి తెలుసుకోవాలని.. అయినా తనను ప్రజలు బాగానే ఆదరిస్తున్నారని ఓ యాంకర్ పేర్కొంది.
ఇదంతా కావాలనే కక్షతో చేసిన పని అని ఇంకో యాంకర్ ఆవేదన వ్యక్తం చేసింది. టీవీ యాజమాన్యం చర్యతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపంలో కూరుకుపోయారని మరో యాంకర్ తెలిపింది. ఉమెన్స్ సెంటర్ ఫర్ గైడెన్స్ అండ్ లీగల్ అవేర్‌నెస్ చానల్ చర్యను ఖండించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. అయితే.. ఈ విషయంలో ఏమాత్రం తగ్గేది లేదని చానెల్ చెబుతోంది. సన్నబడితేనే విధుల్లోకి తీసుకుంటామని అంటోంది. మరోవైపు ఈ ఘటనపై పార్లమెంటులోనూ వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి.

ప్రపంచ రికార్డ్స్ బద్దలుకొట్టిన టీమిండియా

ప్రపంచ రికార్డ్స్ బద్దలుకొట్టిన టీమిండియా


టీమిండియా చెలరేగిపోతుంది. చెన్నై టెస్ట్ లో రికార్డ్స్ బద్దలు కొడుతోంది. కరుణ నాయర్ చెలరేగిపోయాడు. 303 పరుగులు చేశాడు. 32 ఫోర్లు, 4 సిక్స్ లతో స్టేడియం హోరెత్తించాడు. 381 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేశాడు. స్ట్రయిక్ రేట్ 80గా ఉంది. 20-20 మ్యాచ్ లా బ్యాటింగ్ తో అలరించాడు. ఒకే ఇన్నింగ్స్ లో 759 పరుగులు చేసి.. టెస్ట్ క్రికెట్ లో టీమిండియా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఇండియా.. 282 పరుగుల ఆధిక్యంలో ఉంది.

చెన్నై టెస్ట్ రికార్డ్స్

… ఒకే ఇన్నింగ్స్ లో 750పైగా పరుగులు చేయటం టీమిండియా క్రికెట్ చరిత్రలో ఇదే. 2009లో శ్రీలంకపై 726 పరుగులే నిన్నటి వరకు రికార్డ్. ఆ మ్యాచ్ లో ధోనీ సెంచరీ చేశాడు. ఇప్పుడు కోహ్లీ హయాంలో ఆ రికార్డ్ బద్దలు అయ్యింది.
… టెస్ట్ క్రికెట్ లోకి ఎంటర్ అయిన మూడో మ్యాచ్ లోనే త్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కరుణ నాయర్ రికార్డ్. 25 ఏళ్ల నాయర్ గత రెండు మ్యాచ్ ల్లో అత్యధిక స్కోర్ 13 పరుగులు మాత్రమే. మూడో మ్యాచ్ లోనే త్రిపుల్ సెంచరీ చేయటం విశేషం.
… 759/7 టెస్ట్ క్రికెట్ చరిత్రలో.. టాప్ సెవెన్ ఇన్నింగ్స్ స్కోర్ లలో ఇది ఒకటి.
… ఇప్పటి వరకు సెహ్వాగ్ మాత్రమే ట్రిపుల్ సెంచరీ చేశాడు. సెహ్వాగ్ తర్వాత సచిన్ కు కూడా సాధ్యంకాని ట్రిపుల్ సెంచరీతో నాటౌట్ గా నిలిచిన ఆటగాడిగా నాయర్ గుర్తింపు.
… ఐదో బ్యాట్స్ మెన్ గా వచ్చి ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడు నాయర్ మాత్రమే.
… ఇంగ్లండ్ పై అత్యధిక పరుగులు కూడా ఇదే. స్కోర్ 759/7

చంద్రబాబు నాకు రూ.64వేలు అప్పున్నాడు

చంద్రబాబు నాకు రూ.64వేలు అప్పున్నాడు

విజయనగరం: ‘అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ఉద్యోగం లేదా నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి  రెండు సంవత్సరాల ఎనిమిది నెలులు అయింది. నిరుద్యోగిగా ఉన్న నాకు ఆయన ఇప్పటివరకూ రూ.64 వేలు అప్పు ఉన్నాడు. నేను ఇప్పుడు ఎవరిని అడగాలి’  అని బీటెక్‌ చదువుతున్న రోహిత్‌  అనే ఓ విద్యార్థి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో తన ఆవేదన వ్యక్తం చేశాడు.  

చంద్రబాబు అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలం అయ్యారని, అలాగే ఇస్తామన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని పేర్కొన్నాడు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి నిరుద్యోగికి నెలకు రెండువేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు చెప్పారని, అలా నెలకు రెండువేలు చొప్పున తనకు రూ.64వేలు అప్పు ఉన్నారన్నాడు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం  చంద్రబాబు రూ.300 కోట్లు ఖర్చు పెట్టారని, ఆ డబ్బు విద్యార్థుల కోసం ఖర్చు పెట్టి ఉంటే 30 వేల కుటుంబాలు బాగుపడేవన్నాడు. అలాగే  ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ విషయంలోనూ చంద్రబాబు విద్యార్థులను మోసం చేశారని అన్నాడు.

ఇక ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదు, పదినేహేళ్లు కావాలన్న చంద్రబాబు ఇప్పుడు ఫ్లేటు ఫిరాయించారని, పెట్టుబడులంటూ ప్రత్యేక విమానాల్లో తిరిగిన ఆయన... రాష్ట్రానికి ఏ మేరకు పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని  నిఖిల అనే విద్యార్థిని ఈ సందర్భంగా ప్రశ్నలు సంధించింది.  సామాన్యులను మోసం చేసినట్లే విద్యార్థులను కూడా మోసం చేస్తున్నారన్నారు. సింగపూర్‌ కు చంద్రబాబుకు ఉన్న సంబంధమేంటో చెప్పాలని డిమాండ్‌ చేసింది.

పీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చిన ప్రభుత్వం

పీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చిన ప్రభుత్వం

 పీఎఫ్ ఖాతాదారుల ఆశలపై  ప్రభుత్వం నీళ్లు చల్లింది.  రిటైర్మెంట్ నిధి సంస్థ, ఎంప్లాయాస్  ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఒ) వడ్డీరేట్లలో భారీగా కోత పెట్టింది. సోమవారం బెంగళూరులో జరిగిన  ఈపీఎఫ్   సెంట్రల్ ట్రస్టీ  భేటీలో   2016-17ఆర్థిక సంవత్సరానికి డిపాజిట్లపై వడ్డీరేటును  8.65 శాతంగా ప్రకటించింది. గత ఏడాది ఇది 8.8 శాతంగా ఉంది. అలాగే  ప్రస్తుత రేటు ఏడేళ్ల కనిష్టం. దీంతో సుమారు  4 కోట్ల మంది  పీఎఫ్  ఖాతాదారులపై దీని ప్రభావం పడనుంది.
ఈపీఎఫ్ వో కేంద్ర ట్రస్టీల బోర్డు సభ్యులు ప్రస్తుత వడ్డీరేట్లను  ఆశించనంతగా   పెంచలేదు.  కనీసం యధాతథ స్థితిని కూడా కొనసాగించక పోవడంతో ఖాతాదారులు   షాకయ్యారు. డీమానిటైజేషన్ తర్వాత  దేశంలో నెలకొన్న అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో  సంస్థ నిర్ణయం వారిలో భారీ నిరాశను మిగిల్చింది.
కాగా 2015-16  సం.రానికిగాను  గత ఏడాది 8.7 శాతంగా ఉన్న వడ్డీరేటును 8.8 శాతానికి పెంచిన  సంగతి తెలిసిందే.

Sunday, December 18, 2016

బ్యాంక్ ఖాతాదారులకు RBI షాక్

బ్యాంక్ ఖాతాదారులకు RBI షాక్


పెద్దనోట్ల రద్దు తర్వాత పెద్దమొత్తంలో నగదు డిపాజిట్ చేసి విత్ డ్రా చేసుకోవాలనుకునే ఖాతాదారులు పాన్ కార్డ్ సమర్పించాలని ఆర్బీఐ ప్రకటించింది. ఖాతాలో రూ. 2 లక్షలకు మించి ఉన్న అకౌంట్ హోల్డర్స్  పాన్ కార్డ్ నమోదు చేసుకోవాలన్నారు. రూ. 5 లక్షలకు మించి ఉంటే పాన్ తప్పని సరి అని వెల్లడించింది. పాన్ కార్డ్ లేకుంటే ఫారం నెంబర్ 60 ను బ్యాంకుల్లో అందజేయాలని తెలియజేశారు. ఇదివరకు రూ. 50 వేలకు మించి ట్రాన్సాక్షన్స్ జరిపే కస్టమర్లు బ్యాంకు కేవైసీలో పాన్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు నమోదు చేసుకోవాలని చెప్పిన సంగతి తెలిసిందే.
వీటికి పాన్ కార్డ్ తప్పని సరి
… రూ. 2 లక్షలు అంతకు మించి నగదు జమచేసిన వాళ్లు
… రూ. 5 లక్షలకు మించి నగదు నిల్వలు ఉన్న ఖాతాదారులు
… జనధన్ ఖాతాలో రూ. 50 వేలు దాటిన ఖాతాదారులకు ఇకపై పాన్ కార్డ్ తప్పనిసరి
ఇక జనధన్ ఖాతాదారులకు ఇది వర్తిస్తుందన్నారు. ప్రస్తుతం నెలకు రూ. 10 వేలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు. రూ. 50 వేలకు మించి డిపాజిట్ అయిన జన్ ధన్ ఖాతారులపై ఐటీ డిపార్ట్ మెంట్ నిఘా పెట్టింది. కొన్ని జన్ ధన్ ఖాతాలను సీజ్ చేశామని వెల్లడించింది.

వ్యవసాయంతోనే ఊరంతా కోటీశ్వరులు

వ్యవసాయంతోనే ఊరంతా కోటీశ్వరులు


ఆ గ్రామంలో అందరూ ధనవంతులే. అలా అని వ్యాపారవేత్తల ఊరనుకునేరు. కాయకష్టం మీదే ఆధారపడిన గ్రామం . పక్కా వ్యవసాయ ఆధారిత పల్లెటూరు. భూతల స్వర్గంలా ఉన్న ఆ గ్రామం చైనాలో ఉంది. పేరు హుయాక్సి. ఈ గ్రామ విస్తీర్ణం చదరపు కిలోమీటర్. ఆ గ్రామం ఇప్పుడు ప్రపంచాన్నే ఆకర్శిస్తోంది.. కాదు కాదు డబ్బుతోనూ శాసిస్తోంది.
ఒకప్పుడు పూరి గుడిసెలతో.. ఊరంతా నిరుపేదలతో ఉండేది హుయాక్సి.  నేడు ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామంగా మారింది. 1961 నుంచి గ్రామం దశ తిరిగింది. ఆ ఏడాది ఆ ఊరికి యురేన్ బావో కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆ గ్రామంలో ఉన్న 1600 కుటుంబాలు సమిష్టిగా పని చేస్తూ అద్భుతమైన విజయాలు సాధించాయి. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ సొంత విల్లాలు, ఖరీదైన కార్లు ఉన్నాయి. గ్రామంలోని ప్రజలందరికీ వైద్యంతో పాటు గ్యాస్, వంటనూనె ఉచితంగానే సరఫరా చేస్తారు. ఆ చిరు గ్రామాన్ని ఇప్పటికే 20 లక్షల మంది టూరిస్టులు సందర్శించారు. వాళ్లంతా దీన్ని చైనా దుబాయిగా పేరు పెట్టారు.
పాడిపంటలే ఆధారం
ఇక్కడ పాడిపంటలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఖరీదైన కార్లతో పాటు ఎడ్ల బండ్లు, ఆవులు సర్వసాధారణంగా కనపడతాయి. ఇక్కడ అత్యంత ఖరీదైన ఆవు ధర ఎంతో తెలుసా.. అక్షరాల 500 మిలియన్ యువాన్ లు. అదే మన కరెన్సీలో దాని విలువ 48 కోట్ల రూపాయలు. ఇక్కడ వ్యవసాయంతో పాటు ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీలు, స్టీలు మిల్లులు, టెక్స్ టైల్ పార్కులు ఉన్నాయి. ఈ గ్రామం పారిశ్రామిక రంగంలో అత్యధిక అభివృద్ధి దశకు చేరుకోవడంతో.. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వేలాది మంది కార్మికులు ఇక్కడ పరిశ్రమల్లో పని చేస్తారు. సహకార రంగంలో అందరూ వాటాదారులే. సంవత్సరానికి సరాసరి లక్ష డాలర్లు వాటాగా వస్తోంది. 328 మీటర్ల ఎత్తైన 60 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఈ భవనం కూడా బీజింగ్ లో ఉన్నటువంటి ప్రపంచ ట్రేడ్ సెంటర్ లాంటిదే. ఈ గ్రామంలో రెండు వేల మంది యాత్రికులు బస చేయడానికి అన్ని రకాల విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన హోటల్ నిర్మించారు. దీనికంతటికీ కారణం ఆ గ్రామానికి సంబంధించిన స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ యురేన్ బావోనే.
ప్రస్తుతం ఆయన వయస్సు 86ఏళ్లు. ఇప్పుడు ఆయన కుమారుడు ఆ గ్రామ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ మరింత అభివృద్ధి పథంలో గ్రామాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఆ గ్రామంలో అందరూ చదువుకున్నవారే. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ విధిగా సేద్యం చేస్తారు. 55 ఏళ్లుగా ఆ గ్రామ ప్రజలంతా హాయిగా జీవిస్తున్నారు. ఎలాంటి వివాదాలు లేని జీవితాలను గడుపుతున్నారు.