మీ ఖాతాలో రెండు లక్షలు ఉన్నాయా..? అయితే జ్రాగ్రత్త ...
ఇంతకుముందు ఎప్పుడూ బ్యాంకు ఖాతాల్లో 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం లేకుండా.. ఇప్పుడు మాత్రం అలా ఉంటే ఆ ఖాతాదారులు కాస్తంత జాగ్రత్త పడాల్సిందే. అలాంటి ఖాతాలను, వాటిలో గత కొంత కాలంగా జరిగిన లావాదేవీలను రిజర్వు బ్యాంకు పరిశీలించనుంది. ఏవైనా తేడాలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే ఆదాయపన్ను శాఖకు కూడా తెలియజేస్తుంది. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో తదుపరి చర్య ఇలాగే ఉండబోతోందని తెలిసింది. ఇలాంటి అకౌంట్ల వివరాలు ఇవ్వాలని రిజర్వుబ్యాంకు ఇప్పటికే బ్యాంకులను ఆదేశించింది. నల్లధనాన్ని ఖాతాల్లో వేసుకుంటున్న వైనాన్ని బయటపెట్టడానికి ఇదే మంచి మార్గమని భావిస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికైతే పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత నగదు రూపంలో 2.5 లక్షల రూపాయలకు మించి డిపాజిట్లు చేసిన వారి వివరాలను మాత్రమే బ్యాంకులు రిజర్వుబ్యాంకుకు, ఆర్థిక నిఘా విభాగానికి ఇస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా పలువురు పెద్దమనుషుల ఇళ్లు, కార్యాలయాలు, బ్యాంకు లాకర్ల మీద చేసిన సోదాల్లో కట్టల కొద్దీ కొత్త నోట్లు కూడా దొరుకుతున్నాయి. రిజర్వు బ్యాంకు సహా పలువురు బ్యాంకు ఉద్యోగుల పాత్రలు బయటపడుతున్నాయి. దీంతో.. ఇప్పుడు కేవలం నగదు రూపంలో జరుగుతున్న డిపాజిట్లు మాత్రమే కాక, మొత్తం ఖాతాలో లావాదేవీలన్నింటినీ పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రధానంగా టైర్ 2, 3 నగరాల్లోని కొన్ని బ్రాంచీలలో డిపాజిట్లు ఒక్కసారిగా పెద్దమొత్తంలో పెరిగాయి.
ఇప్పుడు రిజర్వు బ్యాంకు అడిగిన వివరాలు చెప్పడం నిజానికి చాలా కష్టమని... డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ కలిపి రూ. 2 లక్షలు దాటిన వాటి లెక్కలు తీయాలంటే చాలా సమయం పడుతుందని ఒక బ్యాంకు అధికారి చెప్పారు. ప్రస్తుతం నల్లధనాన్ని దాచడానికి బినామీ ఖాతాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. పెద్దనోట్ల రద్దుతో మొత్తం 15.4 లక్షల కోట్ల రూపాయల విలువైన కరెన్సీని రద్దుచేయగా, ఇప్పటివరకు అందులో 80 శాతం.. అంటే సుమారు రూ. 12.44 లక్షల కోట్లు వెనక్కి వచ్చాయి. ఈ నెలాఖరు వరకు మిగిలిన నోట్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం గతంలో 2.5 లక్షల వరకు డిపాజిట్లు చేసేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెప్పింది గానీ, ఇప్పుడు రిజర్వు బ్యాంకు మాత్రం 2 లక్షల వరకు ఉన్న డిపాజిట్ల సమాచారం అడుగుతోందని, దీనివల్ల వాటిపై కూడా పరిశీలన జరగుతుందేమోనన్న భయం నెలకొనే ప్రమాదం ఉందని బ్యాంకర్లు అంటున్నారు.
ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి జనధన యోజన ఖాతాల్లో ఒక్కసారిగా డిపాజిట్లు పెరిగాయి. పెద్దనోట్లు రద్దయిన రెండు వారాల్లోనే ఆ ఖాతాల్లో రూ. 27వేల కోట్ల డిపాజిట్లు వచ్చాయి. అంతకుముందు రెండు సంవత్సరాల్లో కలిపి వచ్చినది కేవలం రూ. 45వేల కోట్లు మాత్రమే. దాంతో ఈ ఖాతాలను దుర్వినియోగం చేస్తున్న విషయం స్పష్టంగా బయటపడింది. వేరేవాళ్ల డబ్బులు మీ ఖాతాలలో వేసుకోవద్దంటూ ఆదాయపన్ను శాఖ పత్రికల్లో పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఖాతాలలో ఇంతకుముందు పెద్దమొత్తాలు లేకుండా ఇప్పుడే వేసుకుంటున్న వాళ్లు కాస్తంత జాగ్రత్త పడాల్సిందే.
No comments:
Post a Comment