Sunday, December 18, 2016

వ్యవసాయంతోనే ఊరంతా కోటీశ్వరులు

వ్యవసాయంతోనే ఊరంతా కోటీశ్వరులు


ఆ గ్రామంలో అందరూ ధనవంతులే. అలా అని వ్యాపారవేత్తల ఊరనుకునేరు. కాయకష్టం మీదే ఆధారపడిన గ్రామం . పక్కా వ్యవసాయ ఆధారిత పల్లెటూరు. భూతల స్వర్గంలా ఉన్న ఆ గ్రామం చైనాలో ఉంది. పేరు హుయాక్సి. ఈ గ్రామ విస్తీర్ణం చదరపు కిలోమీటర్. ఆ గ్రామం ఇప్పుడు ప్రపంచాన్నే ఆకర్శిస్తోంది.. కాదు కాదు డబ్బుతోనూ శాసిస్తోంది.
ఒకప్పుడు పూరి గుడిసెలతో.. ఊరంతా నిరుపేదలతో ఉండేది హుయాక్సి.  నేడు ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామంగా మారింది. 1961 నుంచి గ్రామం దశ తిరిగింది. ఆ ఏడాది ఆ ఊరికి యురేన్ బావో కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆ గ్రామంలో ఉన్న 1600 కుటుంబాలు సమిష్టిగా పని చేస్తూ అద్భుతమైన విజయాలు సాధించాయి. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ సొంత విల్లాలు, ఖరీదైన కార్లు ఉన్నాయి. గ్రామంలోని ప్రజలందరికీ వైద్యంతో పాటు గ్యాస్, వంటనూనె ఉచితంగానే సరఫరా చేస్తారు. ఆ చిరు గ్రామాన్ని ఇప్పటికే 20 లక్షల మంది టూరిస్టులు సందర్శించారు. వాళ్లంతా దీన్ని చైనా దుబాయిగా పేరు పెట్టారు.
పాడిపంటలే ఆధారం
ఇక్కడ పాడిపంటలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఖరీదైన కార్లతో పాటు ఎడ్ల బండ్లు, ఆవులు సర్వసాధారణంగా కనపడతాయి. ఇక్కడ అత్యంత ఖరీదైన ఆవు ధర ఎంతో తెలుసా.. అక్షరాల 500 మిలియన్ యువాన్ లు. అదే మన కరెన్సీలో దాని విలువ 48 కోట్ల రూపాయలు. ఇక్కడ వ్యవసాయంతో పాటు ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీలు, స్టీలు మిల్లులు, టెక్స్ టైల్ పార్కులు ఉన్నాయి. ఈ గ్రామం పారిశ్రామిక రంగంలో అత్యధిక అభివృద్ధి దశకు చేరుకోవడంతో.. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వేలాది మంది కార్మికులు ఇక్కడ పరిశ్రమల్లో పని చేస్తారు. సహకార రంగంలో అందరూ వాటాదారులే. సంవత్సరానికి సరాసరి లక్ష డాలర్లు వాటాగా వస్తోంది. 328 మీటర్ల ఎత్తైన 60 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఈ భవనం కూడా బీజింగ్ లో ఉన్నటువంటి ప్రపంచ ట్రేడ్ సెంటర్ లాంటిదే. ఈ గ్రామంలో రెండు వేల మంది యాత్రికులు బస చేయడానికి అన్ని రకాల విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన హోటల్ నిర్మించారు. దీనికంతటికీ కారణం ఆ గ్రామానికి సంబంధించిన స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ యురేన్ బావోనే.
ప్రస్తుతం ఆయన వయస్సు 86ఏళ్లు. ఇప్పుడు ఆయన కుమారుడు ఆ గ్రామ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ మరింత అభివృద్ధి పథంలో గ్రామాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఆ గ్రామంలో అందరూ చదువుకున్నవారే. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ విధిగా సేద్యం చేస్తారు. 55 ఏళ్లుగా ఆ గ్రామ ప్రజలంతా హాయిగా జీవిస్తున్నారు. ఎలాంటి వివాదాలు లేని జీవితాలను గడుపుతున్నారు.

No comments:

Post a Comment